జమ్మూకశ్మీర్‌లోని మచిక్ సెక్టార్‌లో చొరబడిన ఉగ్రవాదులు భారత జవాను ఒకరిని కాల్చిచంపడంతో పాటు, అతన్ని ముక్కలు ముక్కలుగా నరకడంపై సైన్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాశవిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, దెబ్బకు దెబ్బ తీస్తామని భారత సైన్యం ప్రతినబూనింది.
ఉగ్రవాదులకు సాయం చేయడంలో భాగంగా పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ పోస్టుల మీద శుక్రవారం రాత్రి కాల్పులు జరిపారు. ఓవైపు కాల్పులు జరుపుతుండగానే ఉగ్రవాదులు మచిక్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీన్ని సరిహద్దు జవాన్లు తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతంకాగా, భారత్ జవాను మంజీర్ సింగ్ నేలకొరిగాడు.
ఉగ్రవాదులు పీఓకేలోకి పారిపోతూ 27 ఏళ్ల భారత జవాన్ మంజీర్ సింగ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై సైన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పాక్ అధికార, అనధికార ఉగ్ర సంస్థల ప్రమేయంతోనే ఈ ఘాతుకం జరిగిందని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.
దీనిపై హోం మంత్రి రాజ్‌నాథ్ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ నుంచి జరుగుతున్న కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానమిస్తున్నామని, ఎవరికీ తాము తలొంచేది లేదని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి