ఎప్పుడూ తనదైన స్టైల్లో కామెంట్లూ, సెటైర్లూ వేసే పోసానికృష్ణమురళి, ఈసారి వెరైటీగా మెగాస్టార్ చిరంజీవిని పొగడ్తల్లో ముంచెత్తాడు!
చిరు మంచివ్యక్తిత్వం, మర్యాదలు వున్నవాడని, ఏమాత్రం అహంభావంలేని గొప్పవాడని, ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నమస్కారం పెడితే, అంతే మర్యాదగా ప్రతినమస్కారం పెట్టే గుణంవున్న ఏకైకహీరో అని, పోసాని చెప్పాడు. చిరంజీవితో స్నేహంలో తనకు మంచి జ్ఞాపకాలున్నాయని ఆయన అన్నాడు.
అలాగే పోసాని, ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా ప్రస్తావించాడు. పార్టీలో తనకు టికెట్ ఇచ్చినందుకు, చిరంజీవి ఒక్కరూపాయకూడా తీసుకోలేదని, చిరు టికెట్లు అమ్ముకున్నాడనేది ఒట్టి అపొహమాత్రమేనని, పోసాని తెలియజేసాడు. ఇప్పుడుగనక ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ మొదలుపెడ్తే, కచ్చితంగా తను చిరు వెనుకే నడుస్తానని అన్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే ఇంటర్వ్యూలో విలేకరులు పవన్ కళ్యాణ్ గురించి అడిగినపుడు, పోసాని ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇచ్చాడు. తాను మంచివాళ్లగురించి మాత్రమే మాట్లాడుతానని, జనసేనపార్టీ, దాని ఉద్దేశాలేమిటో తనకు అర్థం కాలేదని, అర్థమైనపుడు అభిప్రాయం చెబుతానని తెలియజేసాడు.
కొన్నాళ్ళక్రితం పోసాని, వైయస్సార్ సీపి పార్టీకి అనుకూలంగా మాట్లాడిన విషయం గుర్తుండేవుంటుంది.
ముక్కుసూటిగా కొండొకచో ముఖం బద్దలయ్యేలా మాట్లాడే పోసాని, ఇలా మెగాస్టార్ ని మోసెయ్యడం ఆశ్చర్యపడాల్సిన విషయమే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి